Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 65

Brahmarshi Viswamitra !!

|| om tat sat ||

అథ హైమవతీం రామ దిశం త్యక్త్వా మహామునిః |
పూర్వాం దిశం అనుప్రాప్య తపస్తేపే సుదారుణమ్ ||

'ఓ రామా ! అప్పుడు మహాముని హిమాలయముల దిశ వదిలేసి తూర్పు దిశకి తిరిగి మళ్ళీ దారుణమైన తపస్సు గావించెను

బాలకాండ
అఱువది ఇదవ సర్గము

శతానందుడు విశ్వామిత్రుని కథ కొనసాగించెను.

'ఓ రామా ! అప్పుడు మహాముని హిమాలయముల దిశ వదిలేసి తూర్పు దిశకి తిరిగి మళ్ళీ దారుణమైన తపస్సు గావించెను. ఓ రామ ఒక వెయ్యి సంవత్సరములు ఉత్తమమైన మౌనవ్రతము పట్టి చాలా కష్ఠతరమైన తపస్సు చేసెను. వెయ్యి సంవత్సరములు గడిచినపిమ్మట మహాముని శరీరము కట్టె వలె అయ్యెను. చాలా విఘ్నములు కలిగినప్పటికీ విశ్వామిత్రునకు ఏమాత్రము క్రోధము రాలేదు. ఓ రామా ఆయన పట్టుదలతో తపములో తిష్ఠ వేసెను'.

' ఓ రఘూత్తమ ! ఆ మహావ్రతుడు వెయ్యి సంవత్సరములు వ్రతము పూర్తి అవగానే సిద్ధ అన్నము భోజనము చేయుటకు సిద్ధపడెను. అదే సమయములో ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి సిద్ధాన్నమును అడిగెను. ఆ పూర్తి సిద్ధాన్న్నమంతయూ ఆ విప్రునికి ఒసగి అన్నము శేషములేకున్నప్పుడు తను తినక ఏమియూ అనలేదు. అప్పుడు వేయ్యిసంవత్సరములు ఉచ్ఛ్వాసముచేయకుండా మౌనవ్రతములో ఉండెను. ఆ ఊపిరిబిగపెట్టిన ఆయనయొక్క శిరస్సు నుండి ధూమము బయటకి వచ్చుచుండెను. దానిచేత ముల్లోకములు దగ్ధమౌతున్నట్లు అనిపించెను'.

'అప్పుడు దేవతలు పన్నగులు అసురులు రాక్షసులతో సహా అందరూ ఆయన యొక్క తేజస్సుచే అశ్చర్యపోయి మూర్చ్తులైరి. వారందరూ దుఃఖాక్రాంతులై పితామహునికి అప్పుడు చెప్పిరి. "ఓ దేవా మహాముని యగు విశ్వామిత్రునికి అనేక కారణములవలన ప్రలోభించుటకు కోపము తెప్పించుటకు ప్రయత్నము చేయబడెను. అయిననూ ఆయనకు తపము చేయు పట్టుదల కొంచమైనా తగ్గలేదు. ఒకవేళ ఆయన మనసులో ఉన్న కోరిక తీరకపోతే ముల్లోకములను నాశనము చేయకలడు. దిశలన్నీ వ్యాకులమైనవి . ఏమీ ప్రకాశించుటలేదు. సాగరములన్నీ క్షోభములో ఉన్నాయి. పర్వతములు శిథిలమగుతున్నాయి. భూమి ప్రకంపించుచున్నది. వాయువులు ప్రచండముగా వీచుచున్నవి. జనులు నాస్తికులగుచున్నారు. ఓ బ్రహ్మన్ ! ఏమిచేయుటకు తెలియుటలేదు. ఆయన తేజస్సుచే సూర్యుడు ప్రభలేనివాడు అయ్యెను. మూడులోకములు మానసిక క్షోభకు గురి అయి మూర్చితులై వున్నారు. ఓ దేవా ! మహాముని అగ్ని రూపము గలవాడు. ఆయనకు నాశనము చేయు బుద్ధి కలుగక ముందే భగవన్ ఆయన కోరికలు ప్రసాదించవలెను. పూర్వ కాలములోని కాలాగ్ని వలె ఆయన అఖిలము దహింపగలవాడు , దేవరాజ్యము అడిగినను ఆయనకు ఇవ్వతగును".

అప్పుడు పితామహుని ముందుగా వుంచుకొని అన్ని సురగణములు విశ్వామిత్రునితో మధురమైన వాక్యములను పలికిరి.

"ఓ బ్రహ్మర్షీ ! నీకు స్వాగతము. నీ తపస్సు తో సంతోషపడిన వారము. ఓ కౌశిక ! ఉగ్ర తపస్సు చే నీవు బ్రహ్మత్వము పొందినవాడవు. ఓ బ్రహ్మర్షీ ! మరుద్గణములతో కూడి నీకు దీర్ఘాయువు ప్రసాదించుచున్నాము. నీకు శుభమగు గాక. ఓ సౌమ్యుడా సుఖముగా వెళ్ళుము".

పితామహుని వచనములను విని సంతోషపడిన వాడై అందరు దేవతలకి ప్రణామములు చేసి విశ్వామిత్రుడు ఇట్లు పలికెను. "నాకు బ్రహ్మత్వము అలాగే దీర్ఘాయువు ప్రాప్తించినచో వషట్కారము ఓంకారము వేదములు కూడా నాకు ప్రసాదించుదురు గాక. ఓ దేవులారా ! క్షత్రవేదములు తెలిసినవాడు బ్రహ్మ వేదము తెలిసినవాడు బ్రహ్మపుత్త్రుడు అయిన వసిష్ఠుడు నన్ను ఇదేవిధముగా బ్రహ్మర్షీ అని పిలుచు గాక . ఓ సురులారా ! ఈ నాకోరిక తీర్చి వెళ్ళుదురుగాక".

అప్పుడు దేవతలు జపముచేయువారిలో వరిష్ఠుడైన వసిష్ఠుని ప్రసన్నుని చేసుకోని విశ్వామిత్రునితో సఖ్యముచేసిరి. బ్రహ్మర్షి అగు వసిష్ఠుడు కూడా అట్లే అగుగాక అని చెప్పెను. అప్పుడు దేవతలు ," నీ బ్రహ్మర్షిత్వమునకు సందేహము లేదు. నీకు అన్నియూ సమకూరును " అని చెప్పి తమ తమ స్థానములకు పొయిరి.

'ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు కూడా ఉత్తమమైన బ్రహ్మర్షిత్వము పొంది జపము చేయు వారిలో వరిష్ఠుడైన బ్రహ్మర్షి వసిష్ఠుని పూజించెను. విశ్వామిత్రుడు తన కోరికలను తీర్చుకునినవాడై తపస్సు చేయుచూ భూమండలమంతయూ తిరిగెను'.

"ఓ రామా ! ఆయన ఈవిధముగా బ్రహ్మత్వము పొందెను. ఓ రామ విశ్వామిత్రుడు మునులలో శ్రేష్ఠుడు. తపస్సుకిమూర్తి. నిత్యము ధర్మపరాయణుడు, మహాపరాక్రమశాలి". ఈ విధముగా చెప్పి ఆ మహా తేజోవంతుడైన ద్విజోత్తముడు శతానందుడు మిన్నకుండెను'.

'రామ లక్ష్మణుల సన్నిధిలో శతానందుని వచనములను విన్న జనకుడు ప్రాంజలి ఘటించి కుశికాత్మజుని తో ఇట్లు పలికెను. "ఓ మునిపుంగవ! ఈ కాకుత్‍స్థులతో యజ్ఞమునకు విచ్చేసి నన్ను అనుగ్రహించితిరి. ఓ ధార్మిక ! నేను ధన్యుడనైతిని. ఓ బ్రహ్మర్షీ! మహామునీ ! నీ దర్శనముతో నేను పావకూడనైతిని. నీ దర్శనముతో నాకు అనేక గుణములు ప్రాప్తించినవి. ఓ బ్రహ్మన్ విస్తరముగా కీర్తింపబడిన నీ తపస్సు మహాత్ముడగు నాచేత రాముని చేత వినడమైనది. సదస్సులో సదస్యులు కూడా మీ ఉదాత్తగుణములను వినిరి. ఓ కుశికాత్మజ ! మీ తపస్సు అప్రమేయము. మీ బలము అప్రమేయము. మీ గుణములు అప్రమేయము. ఓ ప్రభో ! ఆశ్చర్యభూతమైన మీ కథ ఎంత విన్నను తృప్తి కలగదు. ఓ మునిశ్రేష్ఠ ! సూర్యుడు అస్తమించుచున్నాడు. ఓ మహాతేజా ! రేపు ఉదయము మాకు పునర్దర్శనమునకు అనుమతి ఇవ్వుడు. మీకు స్వాగతము. మాకు అనుమతి ఇవ్వుడు".

ఆ మునివరుడు ఇట్లు చెప్పబడినవాడై సంతోషపడి సంతోషముతో జనకుని ప్రశంసించి వారికి అనుమతినిచ్చెను. మిథిలాధిపతి అయిన వైదేహి ముని శ్రేష్ఠుని తో ఇట్లు చెప్పి తన పురోహితులు బాంధవులతో ప్రదక్షిణము చేసి వెళ్ళెను.

ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు మహర్షులచే పూజింపబడి రామ లక్ష్మణులతో సహా తన నివాసమునకు చేరెను.

||ఈ విథముగా శ్రీమత్ వాల్మీకి రామాయణములో బాలకాండలో అఱువది ఇదవ సర్గ సమాప్తము||

|| ఓమ్ తత్ సత్ ||

విశ్వామిత్రోsపి ధర్మాత్మా సహరామస్సలక్ష్మణః|
స్వవాస మభిచక్రామ పూజ్యమానో మహర్షిభిః ||

తా|| ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు మహర్షులచే పూజింపబడి రామ లక్ష్మణులతో సహా తన నివాసమునకు చేరెను.


||om tat sat||